తిరుపతి, 31 జులై 2021

 

బర్డ్ ఆస్పత్రిలో ఆరుగురు రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు


టిటిడి బ‌ర్డ్ ట్ర‌స్టు ఆసుప‌త్రిలో శనివారం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఆరుగురు రోగులకు అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది. స్వ‌చ్ఛందంగా విజిటింగ్ క‌న్స‌ల్టెంట్లుగా సేవ‌లందించేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆర్థోపెడిక్ డాక్ట‌ర్ల‌ను టిటిడి ఇటీవల ఆహ్వానించింది. ప్రతి డాక్టర్ నెల‌లో రెండు, మూడు రోజులపాటు ఆసుప‌త్రికి వ‌చ్చి రోగుల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని పలువురు పేద రోగులు బర్డ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందుతున్నారు. 


      కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన 14 ఏళ్ల బాలిక స్కోలియాసిస్(గూని) సమస్యతో ఆసుపత్రిలో చేరింది. దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ వెన్నెముక వైద్యనిపుణులు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సూర్యప్రకాష్ ఈ బాలికకు శస్త్రచికిత్స చేశారు. సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఈ శస్త్రచికిత్స చేసి వెన్నెముకను సరి చేశారు. ఇందుకోసం టైటానియం రాడ్స్, స్క్రూలు వినియోగించారు. ఈ బాలిక మూడు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుని నడవగలుతుందని డాక్టర్ తెలిపారు.


       అదేవిధంగా, మరో రోగి వైద్యం పొందే స్తోమత లేక కొంతకాలం నిర్లక్ష్యం వహించడంతో తుంటి ఎముకను మార్చడంతోపాటు విరిగిన కాలికి నాలుగు చోట్ల శస్త్రచికిత్సలు చేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు డాక్టర్ కృష్ణకిరణ్ ఈ శస్త్రచికిత్సలు చేశారు. ఈ రోగి రెండు నెలల్లో తిరిగి నడవగలుగుతాడని డాక్టర్ తెలిపారు. వీరితోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన మరో నలుగురికి సంక్లిష్టమైన తుంటి ఎముక మార్పిడితోపాటు కంప్యూటర్ నావిగేటెడ్ మోకాలి చిప్ప మార్పిడి చేశారు.


         ఈ సందర్భంగా డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ కృష్ణకిరణ్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు చేసేందుకు బర్డ్ ఆసుపత్రిలో అత్యాధునిక స్టేట్ ఆఫ్ ఆర్ట్ వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. బర్డ్ ప్రత్యేకాధికారిగా డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత నిపుణులైన ప్రముఖ వైద్యులను ఆహ్వానించారని, దీంతో పేదరోగులు మెరుగైన వైద్యసేవలు పొందగలుగుతున్నారని చెప్పారు. వైద్యనిపుణుల సేవలను ఇతర పేదరోగులు వినియోగించుకోవాలని కోరారు. ఈ నెలలో ఈ విధంగా వైద్యనిపుణులు వైద్యసేవలు అందించడం ఇది నాలుగో సారి కావడం విశేషం. ఆగస్టు నెలలో విచ్చేసే వైద్యనిపుణులు, వారందించే వైద్యసేవల షెడ్యూల్ త్వరలో తెలియజేయడం జరుగుతుంది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.