రాష్ట్రంలోని రెడ్ జోన్లలో ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితమైన మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్- 19 నివారణ చర్యలపై సోమవారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్‌లు హజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,229 పరీక్షలు నిర్వహించగా సోమవారానికి మొత్తం 1,25,229 పరీక్షలు నిర్వహించినట్లు సీఎం జగన్‌కు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,092 కి చేరినట్లు తెలిపారు. ఇందులో 524 మంది డిశ్చార్జి కాగా, 36 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల శాతం 1.32 ఉండగా దేశంలో 3.84 ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 2 శాతం కాగా.. దేశంలో 3.27 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Thank You