*9.7.2021*
*వైయస్సార్ కడప*
*వైయస్‌ఆర్ కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా కడప నగరంలో సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్. జగన్ మాట్లాడుతూ..*
ఈ రోజు కడపలో దాదాపు మరో 400 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన పనులు వేగవంతంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మరికొన్ని శంకుస్థాపనలు చేస్తున్నాం.
కడప రోడ్డు మార్గంలో వస్తుంటే, ఇక్కడ జరిగిన అభివృద్ధి పనుల వల్ల ఎంతో అహ్లాదకరకంగా అనిపించింది. గతంలో నాన్నగారి హయాంలో 2004-09 మధ్య కడపలో ఇలాంటి అభివృద్ధి జరిగింది. నాన్నగారు చనిపోయిన తరువాత కడపను, ఈ జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు.
దేవుడిదయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు కడప జిల్లాకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. గతంలో చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ మంచి చేస్తూ, అందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం.
నగరంలో మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లి వరకు 100 అడుగుల వెడల్పుతో ఆరు వరుసల రోడ్లు వేశాం.
మహావీర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎనబై అడుగుల వెడల్పుతో ఫోర్ లైన్ రోడ్లను నిర్మించాం. ఇప్పుడు వీటిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. దాదాపు ఎనబై కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తయి, చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి.
శంకుస్థాపనలు చేసే కార్యక్రమాల గురించి చెప్పాలంటే...
కడప నగరంలో మరికొన్ని ముఖ్యమైన రోడ్లను విస్తరిస్తున్నాం.
కృష్ణాథియేటర్ నుంచి దేవుడి కడప వరకు రూ.101 కోట్లతో ఫోర్ లైన్ల రోడ్లకు శంకుస్థాపన చేస్తున్నాం.
అన్నమయ్య సర్కిల్ నుంచి గోకుల్ లాడ్జ్ వరకు రూ.74 కోట్లతో రోడ్ల విస్తరణ చేస్తున్నాం.
అంబేద్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ రోడ్డు వరకు రూ.62 కోట్లతో రోడ్లు విస్తరణకు శంకుస్తాపన చేస్తున్నాం.
అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లి వరకు రహదారి విస్తరణకు శంకుస్థాపన చేస్తున్నాం.
ఈ రోడ్ల విస్తరణలు జరిగి, సుందరీకరణ పూర్తయితే మంచి నగరాల జాబితాలో కడప కూడా ఖచ్చితంగా చేరుతుంది.
ఒక్కోసారి బుగ్గవంక పొంగి, వరద వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. నాన్నగారి హాయంలో బుగ్గవంక వరద నుంచి రక్షణ గోడ, అయిదు బ్రిడ్జ్‌లు నిర్మించడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు ఆ రోజు నుంచి ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల కాలంలో వరద వచ్చినప్పుడు నగర ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. తిరిగి అటువంటి పరిస్థితి పునరావృత్తం కాకుండా ఉండేందుకు రూ. 49.60 కోట్లతో బుగ్గవంక పెండింగ్ పనులు పూర్తి చేసి, వరద సమస్యను నుంచి పూర్తిగా పరిష్కరించేందుకు, రిటైనింగ్ వాల్ నిర్మాణంను పూర్తి చేసే పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం.
చర్లోపల్లి, పుట్లంపల్లి, రామన్న, బుడ్డాయిపల్లి గొలసుకట్టు చెరువులను పునరుద్దరించడంతో పాటు బ్యూటిఫికేషన్ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం.
తెలుగుభాష అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రఖ్యాత సిపి బ్రౌన్ స్మారకార్థం గ్రంథాలయ ఆవరణలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించే నూతన భవనానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం కలిగిస్తోంది.
దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.
బుగ్గవంక నుంచి కడప నగరానికి రక్షణ కల్పించిప్పటికీ నగరంలోని ఆర్‌కే నగర్, తిలక్‌నగర్, మృత్యుంజయకుంట, ఎస్‌బిఐ కాలనీ, ప్రకాశ్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఎఎస్‌ఆర్ నగర్, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. ఈ సమస్యకు స్ట్రామ్‌వాటర్ డ్రైయిన్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్ చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు డ్రైన్‌లను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుని, దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం.ఈ పనుల వల్ల కడప నగరానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.
గతంలో ప్రారంభించిన పనుల పురోగతికి సంబంధించిన విషయాలకు వస్తే...
రూ.125 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
మరో రూ. 40.82 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ సైకియాట్రిక్ ఆసుపత్రి పనులు చక్కగా జరగుతున్నాయి.
మరో రూ.107 కోట్లతో డాక్టర్ వైయస్‌ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుకు టెండర్ల ప్రకియ పూర్తయింది. ఆటమిక్ రెగ్యులేటరీ బోర్డ్ అనుమతి రావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. అవి కూడా త్వరలోనే వస్తాయి. రాగానే ఆ పనులు కూడా వేగంగా జరుగుతాయి.
దీనితో పాటు రాజీవ్‌మార్గ్ అభివృద్దికి సంబంధించి సుమారు రూ.4 కోట్లతో చేపట్టిన పనులు జోరుగా జరుగుతున్నాయి.
రూ.55 కోట్లతో చేపట్టిన దేవుడి కడప సరస్సు అభివృద్ధి పనులు రివర్స్ టెండరింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ పనులు వచ్చే నెలలో ఊపందుకుంటాయి.
ఇవాళ మీ అందరితో ఒక చిన్న విషయం ఖచ్చితంగా చెప్పాలి. కడప జిల్లాకు ఎంత చేసినా కూడా తక్కువే. ఈ జిల్లా రుణం నేను తీర్చుకోలేను. ఈ జిల్లా ప్రజలు నన్ను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకున్నారు. మీరు ఇచ్చిన భరోసాతోనే నేను రాష్ట్రం వైపు చూడగలిగాను. ఈ జిల్లాను చూడాల్సిన పనిలేదన్న భరోసాతోనే ఇది నేను చేయగలిగాను. ఆ అభిమానం, ఆప్యాయతలు ఎల్లప్పుడ నా మనస్సులో ఉంటాయని, ఇంతటి ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు చూపినందుకు సదా మీకు రుణపడి ఉంటానని చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.
Thank You