No title

*వైయస్ఆర్ పథకాల ద్వారా రైతులకు ఇతోధిక లబ్ది* 


 *రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్* 


విజయవాడ, జూలై 08:

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమైక్య రాష్ట్ర రాజకీయ రంగంలో తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజాకర్షక నాయకునిగా పేద వర్గాల అభ్యున్నతికి అంకిత భావం, నిబద్ధతతో పని చేశారన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ , జక్కంపూడి రామ్మోహన్ రావు రక్తనిధి కేంద్రాన్ని గురువారం విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ అన్ లైన్ విధానంలో ప్రారంభించారు. దివంగత డాక్టర్ వై.ఎస్.రాశశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఈ సేవా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ డాక్టర్ వై.ఎస్. 2003 లో చేవెల్ల నుండి ఇచ్చాపురం వరకు 64 రోజుల పాటు 1500 కి.మీ.లను పాదయాత్ర చేసి ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనకు వచ్చారన్నారు.

ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖరరెడ్డి చిన్న, పేద రైతులకు ప్రయోజనం చేకూర్చే రీతిన వ్యవసాయ, నీటిపారుదల రంగాలకు రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ నిధులను కేటాయించారని గవర్నర్ వివరించారు. మానవీయ కోణంలో ప్రజా శ్రేయస్సు పట్ల శ్రద్ధతో ఎంతో మేలు చేశారని, తద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ పుట్టినరోజును 'రైతు దినోత్సవం'గా జరుపుకోవటం శుభ పరిణామమని కొనియాడారు. ఎస్.జె.ఆర్.ఎమ్.ఆర్ ఫౌండేషన్ స్థాపించడానికి సభ్యులు చేసిన కృషిని గవర్నర్ శ్రీ హరిచందన్ అభినందించారు. జక్కంపూడి రామ్మోహన్ రావు రక్త నిధి ఫౌండేషన్ తన మానవతా కార్యకలాపాలను మరింతగా ముందుకు తీసుకువెళుతుందన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.

గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణ దానంతో సమానమని, మానవ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ప్రతి నగరంలో నమ్మదగిన రక్త నిధి అవసరం ఉందని ఆరోగ్యకరమైన వ్యక్తులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. ఎస్.జె.ఆర్.ఎమ్.ఆర్ ఫౌండేషన్ స్థాపించడానికి చేసిన కృషిని అభినందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.